About

360 Degree Solutions For Sports Needs

హ్యాట్సాఫ్ నాదల్ Started Tennis Academy in Ananthapur,India

హ్యాట్సాఫ్ నాదల్

Sakshi | Updated: August 15, 2014 23:39 (IST)
హ్యాట్సాఫ్ నాదల్
      కరువు నేల వైపు నాదల్ చూపు
     తన ఫౌండేషన్ ద్వారా అనంతలో తొలి టెన్నిస్ అకాడమీ
     గ్రామీణ క్రీడాకారులకు ఉచిత శిక్షణ
     ఇప్పటికే కోట్లు ఖర్చు చేసిన స్పెయిన్ బుల్


ఎర్ర కోర్టులో ఎదురు లేని మొనగాడు... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్‌లను తన ఖాతాలో వేసుకున్న ధీరుడు.. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2గా వెలుగొందుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు కరువు ప్రాంతంగా పిలుచుకునే అనంతపురంనకు సంబంధమేమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న తను ఈ ప్రాంతంలోనే టెన్నిస్ అకాడమీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు నాదల్ పడుతున్న శ్రమను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...            
 (ఆర్‌డీవీ బాలకృష్ణారావు- అనంతపురం అర్బన్)

ఆర్డీటీ... రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంతో మగ్గుతున్న వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం గత 44 ఏళ్ల నుంచి పాటుపడుతున్న ఎన్జీవో సంస్థ. చిన్నారుల్లో క్రీడాభివృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడుతున్న ఈ ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్  విన్సెంట్ ఫై. రాఫెల్ నాదల్ ఇక్కడ తన ఫౌండేషన్ ద్వారా టెన్నిస్ అకాడమీ పెట్టేందుకు ఆయనే ప్రేరణగా నిలిచారు. ఈ సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన నాదల్, అతని తల్లి అన్నే మరియా ‘అనంత’లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

2010లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటు

నాదల్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఉన్న తల్లి అన్నే మరియాతో కలిసి 2010 అక్టోబర్ 17న నాదల్ అనంతపురంలో టెన్నిస్ అకాడమీ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పడిన తొలి అకాడమీ ఇదే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంత క్రీడాకారులను వెలుగులోకి తేవడమే అకాడమీ ముఖ్య లక్ష్యం. ప్రారంభించిన వెంటనే మూడు టెన్నిస్ కోర్టుల నిర్మాణంతో పాటు వంద రాకెట్లు, నిర్వహణ కోసం దాదాపు రూ.51 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా నిధులు ఇస్తూనే ఉన్నారు. 2012-13లో రూ.50 లక్షలు, 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు. ఈ అకాడమీలో సుమారు 170 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఫౌండేషన్ ద్వారా కేవలం నిధులు పంపించడమే కాకుండా.. అన్నే మరియా వీలున్నప్పుడల్లా ‘అనంత’కు వస్తున్నారు. అకాడమీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. నాదల్ గర్ల్‌ఫ్రెండ్ మరియా ఫ్రాన్సిస్‌స్కా కూడా ఫౌండేషన్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె కూడా అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై, స్పోర్ట్స్ డెరైక్టర్లతో సమావేశమవుతూ ఉంటారు.

ఇక్కడా క్లే కోర్టులే...: క్లే కోర్ట్ కింగ్‌గా పిలిపించుకునే రాఫెల్ నాదల్ తనకిష్టమైన ‘ఎర్ర’ మట్టి కోర్టులనే ‘అనంత’ అకాడమీలో ఏర్పాటు చేయాలని ఆర్డీటీకి సూచించారు. ఆటగాడిలో అసలైన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి మైదానాలే ఉపయోగపడతాయని అతడి విశ్వాసం. దీంతో ప్రస్తుతం అకాడమీలో ఐదు క్లే కోర్టులు ఉన్నాయి. రాత్రివేళల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశారు.

పౌష్టికాహారం: ఇక్కడి క్రీడాకారులకు ఆర్డీటీ సంస్థ పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఉదయం రాగి మాల్ట్‌తో పాటు గుడ్డు, సాయంత్రం మరో గుడ్డు, అరటిపండ్లను ఇస్తున్నారు. క్రీడాకారుల ఫిట్‌నెస్‌తో పాటు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ: టెన్నిస్ మెళకువలతో పాటు ఆటగాడికి ఉండాల్సిన అదనపు లక్షణాలను అలవర్చేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వీరికి ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ గంటపాటు ఈ శిక్షణ ఉంటుంది. స్పెయిన్‌కుచెందిన మరియా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు.

ముగ్గురు కోచ్‌లు:  నాదల్ టెన్నిస్ అకాడమీలో భాస్కరాచార్య, కరీముల్లా, రాజశేఖర్ అనే ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. వీరితో పాటు స్పెయిన్ నుంచి కూడా కోచ్‌లు వస్తుంటారు. వీరు ఆరు నెలల పాటు అకాడమీలో కో ఆర్డినేటర్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

‘అనంత’లో ఐటా పోటీలు: భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) ఇక్కడ 2013 అక్టోబర్‌లో అండర్ -16 బాల బాలికల పోటీలు, నవంబర్‌లో అండర్ -14 పోటీలు నిర్వహించారు.

ఇక్కడ అంతా ఉచితమే

ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ఫౌండేషన్‌లో కోచింగ్ అంటే.. వామ్మో.. అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిక్షణకు నయా పైసా ఖర్చు కాదు. అంతా ఉచితమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఇక్కడ కోచింగ్ లభిస్తుంటుంది. అయితే వారికి వసతి సౌకర్యం మాత్రం ఉండదు. 6-14 ఏళ్ల లోపు వారు మాత్రమే కోచింగ్‌కు అర్హులు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని రాప్తాడు, ఉప్పరపల్లి, హంపాపురం, ఆకుతోటపల్లి, అనంతపురం నగరానికి చెందిన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే.  

 నాదల్ స్థాయికి ఎదగాలి
 - మాంఛో ఫై, ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్
 రాఫెల్ నాదల్ ‘అనంత’లో అకాడమీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు నాదల్ స్థాయికి ఎదగాలి. నాదల్ ఆకాంక్ష కూడా అదే. ఆ దిశగానే శిక్షణ ఇప్పిస్తున్నాం.  ఏదో ఒక రోజు మంచి క్రీడాకారులు తప్పక వెలుగులోకి వస్తారు.

 విద్యతో పాటు క్రీడాభివృద్ధికి కృషి
 - రడువాన్, స్పెయిన్ కోచ్
విద్యతో పాటు క్రీడాభివృద్ధి కోసం నాదల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.  గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ అకాడమీ ఎంతో సహాయపడుతుంది. ఈ అకాడమీ నుంచి బయటకు వెళ్లిన వారు సొంత కాళ్లపై నిలబడగలుగుతారు.


Leave a Reply